సిద్ధిపేటలో పెళ్లి జరిగితే మొక్కలు కానుకగా ఇవ్వండి

సిద్దిపేట్ లోకల్ టైమ్స్ ప్రతినిధి :::

  • ప్రతి పెళ్లిలో కనీసం 100 మొక్కలు ఇవ్వాలని నిర్ణయం
  • ప్రతి ఫంక్షన్ హాల్ గ్రీనరీగా, పార్కింగ్
    విశాలంగా ఉండాలి
  • ప్లాస్టిక్ రహిత ఫంక్షన్ హాల్స్ తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట , ఫిబ్రవరి 15: సిద్ధిపేటలో జరిగే ప్రతి వివాహా వేడుకల్లో గిఫ్టులు, బొకేలకు బదులు పెళ్లికి అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్క అతిథికి మొక్కను కానుకగా ఇవ్వాలని, అలా మొక్కలు ఇచ్చిన వారి పెండ్లికి నేను తప్పకుండా హాజరవుతానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం పట్టణంలోని ఫంక్షన్ హాల్స్, వీధి వ్యాపారులు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇతరత్రా వాణిజ్య వ్యాపార సముదాయాలు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళి-2016 తెలంగాణ మున్సిపల్ చట్టం-2019, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ పాలసీ ప్రకారం చేపట్టాల్సిన అంశాలపై మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటుగా ఏసీపీ రామేశ్వర్, సీఐలు సురేందర్ రెడ్డి, సైదులు, ట్రాఫిక్ సీఐలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ముందుగా ప్రతి ఫంక్షన్ హాల్ లో మొక్కలు నాటి, వాటి సంరక్షణ చూసుకోవాలని, అప్పుడే మీ ఫంక్షన్ హాల్ సుందరంగా ఉంటుందని సూచించారు. పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ చెట్లు ఇచ్చే సంస్కృతి రావాలని కోరుతూ.. సిద్ధిపేటలో మానవత్వపు గది, ఫీడ్ ద నీడ్ కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచేలా మీ వంతు పాత్ర పోషించాలని కోరారు. ఫంక్షన్ హాల్ లో మిగిలిన ఆహారం ఫీడ్ ద నీడ్ కేంద్రాలకు పంపించాలని కోరారు. ఫంక్షన్ హాల్ కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయం కల్పించి, సెక్యూరిటీ కార్డును నియమించి వాహనాలను క్యూ పద్ధతిలో పెట్టించాలని., ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు.

  • ప్లాస్టిక్ రహిత ఫంక్షన్ హాల్స్ కావాలి

సిద్ధిపేటలో 26 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయని, నిర్వహణ సమర్థవంతంగా, పరిశుభ్రంగా నిలపాలన్నదే లక్ష్యమని మంత్రి హరీశ్ రావు కోరారు. సింగిల్ ప్లాస్టిక్ నియమ నిబంధనలను వ్యాపార, వాణిజ్య వర్గాలకు మంత్రి సవివరంగా వివరించారు. వీటిలో వాటర్ బాటిల్స్, వాటర్ పాకెట్స్, పెట్ బాటిల్స్ వాడకాన్ని నిషేదించాలని, హోటల్స్, షాప్స్, కర్రీ పాయింట్స్, ఫంక్షన్ హాల్స్, బంకేట్ హాల్స్ నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని నిషేదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉన్న సంచులు, స్టీల్ పాత్రలు వాడాలని కోరారు. నిషేధిత ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ వద్దని, ఫంక్షన్ హాల్స్ లో టాయిలెట్స్, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా నిలిపేలా చూడాలని ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలకు మంత్రి సూచనలు చేశారు. నిషేధిత వివరాలు ముందుగా నోటీసు అయ్యే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించి, ఫైబర్ ప్లేట్స్, గాజు గ్లాసులు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకించి తడి, పొడి హానికర చెత్తను వేర్వేరుగా ఉండేలా చూడాలని కోరారు. తడిచెత్త నుంచి బయోగ్యాస్ లేదా వర్మీ కంపోస్టు తయారీ మీ పరిసర ప్రాంతాలలో తయారయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పొడి చెత్తను పట్నంలో చెత్త సేకరణ కేంద్రాలు 16 వరకూ ఉన్నాయని, చెత్త కొనుగోలు కేంద్రాలకు మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని సూచించారు. హానికర చెత్తను పర్యావరణ పరిరక్షణలో వాటిని నిర్ములిద్దామని, ఇందుకు తగిన పరికరాలు అందుబాటులో ఉంటాయని, వాటి నుంచి పట్టణ ప్రజలకు హాని కలగకుండా పూర్తిగా నిర్ములించేలా క్లిన్ సిద్ధిపేటను సాధిద్దామని వ్యాపార, వాణిజ్య వర్గాలను మంత్రి కోరారు.

  • శ్రీ రామకుంట్ల స్మశాన వాటిక ఉత్తమ దహన సంస్కారాలు

సిద్ధిపేటలోని శ్రీ రామకుంట్ల స్మశాన వాటికలో ఉత్తమ దహన సంస్కారాలు అందించాలని, ప్రధానంగా పిడకలతో అంత్యక్రియలు జరిపేలా, పిడకలు, కర్పూరం, నెయ్యితో అంత్యక్రియలు జరిగేలా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచనలు చేశారు. అదే విధంగా వీధి వ్యాపారులకు పురోభివృద్ధి కల్పించేలా ఈ నెల 25వ తేదీ లోపు వీధి వ్యాపారుల జోన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started